: తమ ఐపీఆర్ హక్కుల తస్కరణపై చైనాపై విచారణకు ఆదేశించిన ట్రంప్!
తమ ఐపీఆర్ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ - మేధోసంపత్తి హక్కులు)లను చైనా తస్కరిస్తోందన్న ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారణకు ఆదేశించారు. న్యూజర్సీలో 17 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన, వైట్ హౌస్ కు రాగానే, చైనా ఐపీఆర్ హక్కులపై విచారించాలన్న దస్త్రంపై సంతకం చేశారు.
ఆపై నార్త్ కోరియా నిర్వహిస్తున్న అణు పరీక్షలు, నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉన్న తరుణంలో ఈ తరహా విచారణ, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను సంక్లిష్టం చేస్తుందని దౌత్యాధికారులు భావిస్తున్నారు. ట్రంప్ ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం కీలక చర్యని అభివర్ణిస్తున్నారు.
కాగా, సుమారు 600 బిలియన్ డాలర్ల విలువైన ఐపీఆర్ హక్కులను చైనా దొంగతనం చేసిందని ట్రంప్ పరిపాలనా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలోనే నిజానిజాలను వెలికి తీయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.