: సంస్కరణల పిపాసి మోదీ 2019 వరకూ వాటి జోలికి వెళ్లకపోవచ్చు... ఇకపై ప్రజాకర్షక విధానాలే!


ప్రధాని మోదీ తన రూటు మార్చనున్నారు. సంస్కరణలతో సంచలనాలు రేపిన ప్రధానిగా ఆయన ప్రజలకు సుపరిచితులు. నల్లధనంపై పోరు పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసి పిల్లల నుంచి పండు ముదుసలి వారి వరకూ బ్యాంకు ముందు నించోబెట్టారాయన. మొబైల్ సిమ్ కార్డు, బ్యాంకు ఖాతా, పాన్ కార్డు ఇలా అన్నింటినీ ఆధార్ నంబర్ తో అనుసంధానించే కార్యక్రమం కూడా చేపట్టారు. పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీలను పూర్తిగా ఎత్తేశారు. గ్యాస్, కిరోసిన్ లపై సబ్సిడీలను కూడా నెలనెలా తగ్గిస్తూ వెళుతున్నారు. త్వరలో వాటికీ పూర్తిగా పుల్ స్టాప్ పెట్టేయనున్నారు.

రూ.2 లక్షలకు మించి విలువ మేరకు ఏ కొనుగోలు, అమ్మకం అయినా నగదు రూపంలో జరగకుండా నిషేధం విధించారు. జీఎస్టీ పేరుతో కొత్త పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆయన సంస్కరణల పుస్తకంలో ఇలాంటి ఆయుధాలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ, వాటిని ప్రయోగించడానికి సమయం లేదు. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయమే ఉంది మరి.

 అందుకే ఇకపై భారీ సంస్కరణలను పక్కన పెట్టేసి ప్రజాకర్షక విధానాలను ఆయన అనుసరించబోతున్నట్టు బార్క్ క్లేస్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సిద్ధార్థ సన్యాల్ అంచనా వేశారు. 2019 ఎన్నికల్లో నూతన ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగిరేందుకు వీలుగా మోదీ ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణలు, ప్రాజెక్టుల తాలూకూ ఫలితాల బలోపేతంపై దృష్టి పెడతారని అంచనా వేస్తున్నట్టు సన్యాల్ పేర్కొన్నారు. ప్రజల మనసు చూరగొనేందుకు పాలనాపరమైన సంస్కరణలను చేపట్టే అవకాశం ఉందన్నారు.

  • Loading...

More Telugu News