: జగన్! బుద్ధి తెచ్చుకో..లేకపోతే కనుమరుగవుతావు!: టీడీపీ నేత బీకే పార్థసారధి
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బీకే పార్థసారథి మండిపడ్డారు. అనంతపురంలోని స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బుద్ధి, జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తిస్తున్న జగన్ నోటికొచ్చినట్టు మాట్లాడటం సబబు కాదని అన్నారు.
జగన్ కుటుంబం నేర చరిత్రతోనే రాజకీయాల్లోకి వచ్చిందని, నరసయ్య అనే వ్యక్తిని చంపి గనులు స్వాధీనం చేసుకున్న చరిత్ర జగన్ తాతదని, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుపైనే చెప్పులు వేయించిన ఘనత జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని ఆరోపించారు. ‘జగన్! నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా జనం నమ్మరు. బుద్ధి, జ్ఞానం తెచ్చుకుని బతుకు. లేకపోతే, భవిష్యత్తులో కనుమరుగవుతావు’ అంటూ పార్థసారథి హెచ్చరించారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు ఖాయమని, మంచి మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధిస్తాడని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు.