: షీనాబోరా హత్య కేసు: నాడు ఇంద్రాణి ఇచ్చిన పార్శిల్ లో 'గన్' ఉందన్న డ్రైవర్!
షీనాబోరా హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ శ్యాంవర్ రాయ్ కీలక విషయాలను కోర్టుకు తెలిపాడు. 2012లో తనకు ఇంద్రాణి ముఖర్జియా ఓ పార్శిల్ ఇచ్చిందని, అందులో తుపాకీ ఉందని చెప్పాడు. ఇంద్రాణిని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసేందుకు వెళ్లినప్పుడు తుపాకీ ఉన్న పార్శిల్ ను ఆమె తనకు ఇచ్చారని తెలిపాడు.
అయితే, ‘ఆ తుపాకీని పారవేయమని చెప్పారా? లేక, జాగ్రత్తగా ఉంచమన్నారా?’ అంటూ న్యాయవాది సుదీప్ పస్బోలా ప్రశ్నించారు. దానిని జాగ్రత్తగా దాచమని చెప్పారని, అయితే, ఆ పార్శిల్ ను తెరిచిన తర్వాత అందులో గన్ ఉండడంతో ఆమె వద్ద పని చేయడం మానేసినట్టు శ్యాంవర్ చెప్పాడు. కాగా, ఈ హత్య కేసు వ్యవహారంలో 2015లో శ్యాంవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని అరెస్టు చేసిన తర్వాతే షీనాబోరా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.