: చెట్లను కాపాడండి... ఎగస్ట్రా మార్కులు పొందండి!: విద్యార్థులకు ఢిల్లీ కార్పోరేషన్ ఆఫర్
మొక్కలు నాటే కార్యక్రమాల్లో భాగంగా నాటిన మొక్కల్లో ఎన్ని బతుకుతున్నాయ్? మహా అయితే 40 శాతం... మరి మిగిలినవన్నీ నాటిన నెలకో రెండు నెలలకో చనిపోతున్నాయి. ఇలా జరగకుండా ఉండటం కోసం నాటిన మొక్కలను కాపాడే పనిలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ యోచిస్తోంది. ఊరికే కాదులెండి... విజయవంతంగా మొక్కను కాపాడిన విద్యార్థికి సంవత్సరాంతంలో సర్టిఫికెట్‌తో పాటు 5 మార్కులు కూడా కలపాలని పాఠశాలలకు ఆదేశాలు జారీచేయనున్నట్లు సమాచారం.
మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 4, 5 తరగతులు చదివే పిల్లల సిలబస్‌లో భాగంగా ఈ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీని పొందుపర్చనున్నారు. పిల్లలు మొక్కలపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అంచనా వేసి, దాని ఆధారంగా మార్కులు కేటాయించవలసిన బాధ్యతను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో నాటిన మొక్కల్లో బతికే రేటును పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తెలియజేశారు.