: చౌకబారు విమర్శలు చేసేందుకు వెనుకాడని చంద్రబాబు, జగన్!
ఇటీవల చంద్రబాబునాయుడు ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆశ్చర్యకరంగా, ఒక్క టెలివిజన్ చానల్ నూ ఆ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఇక్కడ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే... 2003లో అలిపిరి వద్ద తనపై జరిగిన హత్యాయత్నం వెనక అప్పటి తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ ఉన్నాడని... వాస్తవానికి చంద్రబాబు ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులతో ఏం చెప్పాడన్న విషయమై ఎలాంటి వీడియోలు లేకపోగా, ఇదే విషయాన్ని మీడియా ప్రముఖంగా ప్రచురించింది కూడా.
ఫేస్ బుక్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఓ న్యూస్ ఆర్టికల్ ను టీడీపీ పోస్టు చేసింది. ఇక చంద్రబాబు ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేయడంపై ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అత్యంత కీలకమైన నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ, గెలుపే లక్ష్యంగా నేతలు చౌకబారు విమర్శలకు దిగుతున్నారని, అందులో భాగంగానే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి మూడు నాలుగు రోజుల ముందు, నంద్యాలలో జగన్ పర్యటిస్తూ, చంద్రబాబును నడిరోడ్డు మీద కాల్చి చంపాలని కోరారు. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు వైఖరిని చూడలేక తానీ వ్యాఖ్యలు చేశానని, అది తనలోని మనోవేదనా ఫలితమని జగన్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. వాస్తవానికి ఏపీలోని రెండు అతిపెద్ద పార్టీలైన టీడీపీ, వైకాపాలు, ఈ నెల 23న జరిగే నంద్యాల ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మే 2014లో వైకాపా తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి, ఆపై టీడీపీలో చేరి మరణించిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీకి 106 సీట్లలో విజయం లభించగా, జగన్ నేతృత్వంలోని పార్టీ 67 మందిని గెలుచుకుంది. తదుపరి జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 20 మంది ఫిరాయించారు.
ఇక వైకాపా, గత రెండు మూడు రోజుల నుంచి మరో వీడియోను సోషల్ మీడియాలో రంగంలోకి దించింది. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని శిల్పా మోహన్ రెడ్డి వేడుకుంటుండగా, డబ్బెక్కడిదని తిరిగి ప్రశ్నిస్తున్న చంద్రబాబు వీడియోను వైకాపా తన తాజా అస్త్రంగా ప్రయోగించింది. చంద్రబాబు కేవలం ఓట్ల కోసమే నిధులు ఇస్తున్నట్టు నాటకం ఆడుతున్నారని, పోలింగ్ తరువాత ప్రకటించిన డబ్బులు విడుదల కావని జగన్ తన ప్రచారంలో గంటకోసారి చెబుతున్న పరిస్థితి. తాము పోటీకి దిగకుంటే, అసలు ఒక్క రూపాయి కూడా నంద్యాలకు దక్కేది కాదని ఆయన విమర్శల బాణాలు గుప్పిస్తున్నారు. ఇక అధినేతల ప్రచార సరళి, వాగ్బాణాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ఇప్పుడే ఇలా వుంటే, 2019లో జరిగే ఎన్నికల నాటికి విమర్శల వేడి ఇంకెంత పెరుగుతుందోనని లెక్కలు కడుతున్నారు.