: గన్నవరం శ్రీచైతన్య స్కూలులో మూడో అంతస్తు నుంచి కిందపడ్డ విద్యార్థి... స్వల్ప గాయాలతో బయటపడ్డ బాలుడు!
నర్సరీ విద్యార్థి మూడో అంతస్తు నుంచి కిందపడిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...గన్నవరంలోని కొత్తపేటలోని శ్రీ చైతన్య స్కూల్ లో కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన నిఖిల్ చంద్ (4) నర్సరీ చదువుతున్నాడు. ఉదయం 10:30 గంటల సమయంలో తన క్లాసు పక్కనే ఉన్న ఖాళీ గదిలోకి వెళ్లాడు. అక్కడ గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో కిటికీ వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో జారి కిందపడిపోబోయాడు. అయితే అంతలోనే తేరుకుని దానికున్న సన్ షేడ్ పట్టుకున్నాడు. దానిని చూసిన పక్క అపార్ట్ మెంట్ లోని శ్రీదేవి అనే మహిళ గట్టిగా కేకలు వేసింది. అయితే ఆమె అరుపులు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బాలుడ్ని రక్షించాలని ఆమె స్కూలు వద్దకు పరుగుతీసింది.
ఇంతలో ఆ బాబు చేతులు సన్ షేడ్ ను నుంచి పట్టుతప్పాయి. దీంతో మూడో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. పెద్ద శబ్దం కావడంతో అంతా పరుగున అక్కడికి చేరుకున్నారు. స్కూలు సిబ్బంది అప్పటికి తేరుకుని మూడో అంతస్తు నుంచి కిందపడిన నిఖిల్ చంద్ ను లోపలికి తీసుకెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని శ్రీదేవి అపార్ట్ మెంట్ వాసులకు చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో స్థానికులు స్కూలు సిబ్బంది, యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని, బాధిత బాలుడ్ని చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు.
ఇంతలో తల్లిదండ్రులు విషయం తెలుసుకుని లబోదిబోమంటూ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం బాలుడ్ని పరీక్షల నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు చాలా అదృష్టవంతుడని, అలా సన్ షేడ్ ను పట్టుకుని వేలాడకపోయి ఉంటే కాంపౌండ్ వాల్ పై పడేవాడని, అలా వేలాడడం వల్ల తిన్నగా కిందపడ్డాడని, దీంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడని ప్రత్యక్ష సాక్షులు అభిప్రాపడుతున్నారు. మరికొందరైతే మూడంతస్తుల ఎత్తు నుంచి కిందపడి స్వల్పగాయాలు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పదించిన డీఈవో స్కూల్ ప్రిన్సిపల్, తరగతి టీచర్ ను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.