: ఇక షేర్స్, మ్యూచువల్ ఫండ్లు కొనాలన్నా ఆధార్ కావాలి!
ఇప్పటికే అన్ని రకాల ప్రభుత్వ సేవలకు, ధ్రువీకరణ పత్రాలకు ఆధార్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇక నుంచి మదుపర్ల మార్కెట్ కూడా ఆధార్ ఆధారంగానే నడిచేలా చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఇక నుంచి ఆధార్ ఉంటేనే సాధ్యపడేలా ఉంది. అంతేకాకుండా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు ఆధార్‌ను ముడిపెట్టేందుకు సెబీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్రమంగా సంపాదించిన నల్లడబ్బును స్టాక్ మార్కెట్ల పెట్టుబడి ద్వారా చాలా మంది తెల్లడబ్బుగా మారుస్తున్నారని, వీరిని కట్టడి చేయడానికే ఈ ఆధార్ అనుసంధానమని మదుపర్ల మార్కెట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షేర్లలో, మ్యాచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. ఇక ఆధార్‌ను తప్పనిసరి చేసి, పాన్ అవసరం లేదంటారో లేక రెండూ కావాలంటారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే దీనికి సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులను సెబీ జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని ఆర్థిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.