: నేపాల్ మహిళలపై వివక్ష.. రుతుస్రావం సమయంలో బయటకు పంపేస్తున్న పెద్దలు.. శిక్షలు విధించేందుకు సిద్ధమైన ప్రభుత్వం!


రుతుస్రావం సమయంలో మహిళలను ఇంటి నుంచి దూరంగా పంపే వారిపై ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం ఈ ఆచారాన్ని నేరంగా పరిగణించింది. ఇకనుంచి ఎవరైనా దీనిని ఆచరిస్తే మూడు నెలల జైలు శిక్ష, లేదంటే రూ.3 వేల జరిమానా, అవసరమైతే  రెండూ విధించేలా చట్టాన్ని రూపొందించింది.

నేపాల్‌లోని పలు తెగలవారు రుతుస్రావం సమయంలో మహిళలను ఇంట్లో నిద్రపోనివ్వరు. మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిన్న గుడిసెలోకి పంపించేస్తారు. తిరిగి రుతుస్రావం పూర్తయ్యాకే వారు ఇంటికి రావాల్సి ఉంటుంది. ‘చౌపాడి’ పేరుతో దీనిని అక్కడి వారు ఆచరిస్తారు. దీనిని పాటించని వారిపై ఇక నుంచి ఎటువంటి వివక్ష ప్రదర్శించరాదని ప్రభుత్వం చేసిన తాజా చట్టంలో పేర్కొంది.

గత నెలలో ఇలా చౌపాడికి వెళ్లిన ఓ బాలిక పాము కాటుకు గురై మృతి చెందడంతో ఈ విషయంపై దుమారం చెలరేగింది. గతేడాది కూడా ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీంతో హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే చౌపాడిని సుప్రీంకోర్టు దశాబ్దాల క్రితమే నిషేధించినా మారుమూల జిల్లాల్లో ఇంకా కొనసాగుతోంది. రుతుస్రావానికి కారణం ఏంటో తెలిసి, వారు అర్థం చేసుకునే వరకు ఈ చౌపాడికి అడ్డుకట్ట పడే అవకాశం లేదని కొందరు చెబుతుండడం గమనార్హం. ప్రభుత్వాలు చట్టాలు చేసినంత మాత్రాన దీనిని ఆపడం సాధ్యం కాదని, దీనిపై మహిళల్లో అవగాహన కల్పించాల్సి ఉందని మహిళా హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News