: ఇక పెళ్లిళ్లే.. పెళ్లిళ్లు.. నేటి నుంచి శుభ ముహూర్తాలు మొదలు.. తిరుమల కల్యాణ మండపాలు వారం పాటు ఫుల్!
పెళ్లిళ్లకు సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాలు ఇక పెళ్లి సందడిలో మునిగిపోనున్నాయి. నేటి నుంచి శ్రావణ ముహూర్తాలు ఊపందుకోనున్నాయి. ఫలితంగా వివాహంతో సంబంధం ఉన్న ప్రతి దుకాణం కిటకిటలాడిపోనుంది. శ్రావణ పౌర్ణమి తర్వాత ‘నక్షత్రానికి’ బలం ఎక్కువ ఉండడంతో వేలాది పెళ్లిళ్లకు ముహూర్తాలు కుదిరాయి. జీఎస్టీని కూడా పక్కనపెట్టేసి బంగారం కొనుగోళ్లకు పరిగెడుతున్నారు. ఫంక్షన్ హాళ్లకు ఉన్న పళంగా డిమాండ్ పెరిగింది. పురోహితులు, క్యాటరింగ్, ఫొటో, వీడియో గ్రాఫర్లను వెతికి మరీ పట్టుకుంటున్నారు.
ముఖ్యంగా ఈనెల 11, 16 తేదీల్లో మూడేసి శుభ ముహూర్తాలు ఉండడంతో ఆ రోజున పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ సంస్థలు, స్కూళ్లకు కూడా సెలవులు ఉండడంతో పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులు మొత్తం సిద్ధమవుతున్నారు. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా అన్ని పెళ్లిళ్లకు హాజరై మాటల దాడి నుంచి తప్పించుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు.
మరోవైపు వందలాది పెళ్లిళ్లు జరిపించేందుకు దేవాలయాలూ సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. తిరుమల, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల తదితర పుణ్యక్షేత్రాల్లో వివాహాల కోసం బుకింగ్‌లు కూడా ఈపాటికే పూర్తయ్యాయి. సెలవులకు తోడు, పెళ్లిళ్లు కూడా ఉండడంతో తిరుమల కిటకిటలాడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుమలలోని టీడీడీ కల్యాణ మండపాలతోపాటు మఠాల్లోని మండపాలు కూడా వారం రోజులపాటు బుక్ అయిపోయాయి. టీడీడీ కల్యాణ వేదికలో బుధవారం వరకే 280 వివాహాల కోసం బుక్ చేసుకున్నారు. గురువారం 40, శుక్రవారం 52, శనివారం 72, 16న 80 జంటలు శ్రీవారి సాక్షిగా ఒక్కటి కానుండడం విశేషం.