: పాకిస్థాన్ వ్యూహాన్ని అమలు చేస్తోంది...ఐసీసీ తలవంచుతుందా?
పాకిస్థాన్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)...భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ఆడుతామని బీసీసీఐ స్పష్టం చేయడంతో అవాక్కైంది. దీంతో వంద కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దానిని బీసీసీఐ పట్టించుకోలేదు. ఐసీసీకి భారత్ పై ఫిర్యాదు చేసింది. అయినా భారత్ ను ఏమీ చేయలేకపోయింది. ఇంతలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఐసీసీకి కాసుల పంట పండించింది. దీంతో మళ్లీ కళ్లుకుట్టిన పీసీబీ భారత్ తో ఎలాగైనా ఆడాలని, ఇందుకు నేరుగా బీసీసీఐ ద్వారా కాకుండా వేరే రూట్లో బీసీసీఐని ఒప్పించాలని భావించింది.
దీంతో రంగంలోకి దిగిన జావెద్ మియాందాద్ భారత్ తో పాకిస్థాన్ ఏ టోర్నీలో ఆడకూడదని తీర్మానించాడు. భారత్ తో టోర్నీలు బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో పీసీబీ వ్యూహం అమలు చేయడం ప్రారంభించింది. ఈ నవంబర్ లో బెంగళూరులో జరగనున్న అండర్-19 ఆసియాకప్ వేదికను భారత్ నుంచి తరలించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేస్తోంది. భారత్ లో ఈ టోర్నీ నిర్వహించడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, తమ క్రీడాకారులకు వీసాలు లభ్యం కావని, అలాగే భారత్ లో భద్రతా సమస్యలున్నాయని ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకుని భారత్ నుంచి టోర్నీని తరలించాలని పీసీబీ అధికారులు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తద్వారా ఐసీసీకి విన్నవించనున్నారు. త్వరలో కొలంబోలో జరగనున్న ఏసీసీ సర్వసభ్య సమావేశంలో దీనిని తెరపైకి తెస్తామని పీసీబీ చెబుతోంది.