: నీ స్టేచర్ ఏంటి? నా స్టేచర్ ఏంటి?... నువ్వా నాతో తలపడేది?... : బిగ్ బాస్ హౌస్ లో ఆదర్శ్ ని ఏడిపించిన శివబాలాజీ!
హిందీ బిగ్ బాస్ ప్రారంభం నుంచి చివరి వరకు వివాదాల మయంగా సాగుతుంది. తమిళ బిగ్ బాస్ లో కూడా ఒక వివాదం రేగింది. తెలుగు బిగ్ బాస్ హౌస్ చాలా ప్రశాంతంగా ఏమాత్రం వివాదం లేకుండా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ బయట వివాదాలు రేగినా హౌస్ లో మాత్రం ఇంతవరకు ఎలాంటి వివాదం రేగలేదు. అయితే గత రాత్రి సినీ నటుడు శివబాలాజీ మరో నటుడు ఆదర్శ్ పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కాస్త వివాదం రేపాయి. ఈ వివాదం వివరాల్లోకి వెళ్తే... బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులకు బిగ్ బాస్ టాస్క్ లిస్తాడన్న సంగతి తెలిసిందే. అలాగే తాజాగా ముళ్ల కుర్చీ టాస్క్ ఇచ్చాడు.
ఇందులో పార్టిసిపెంట్స్ చేయాల్సిందల్లా కుర్చీమీద కూర్చుని ఉండడమే... రెండో టీమ్ అలా కూర్చున్నవారిని తమ యుక్తితో కిందికి దించాలి. ఈ టాస్క్ పర్యవేక్షణ మహేష్ కత్తి చేస్తాడని చెప్పారు. టాస్క్ ముగిసిన తరువాత బెస్ట్ అండ్ వరెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రకటిస్తామని, గెలిచిన వారికి లగ్జరీ బడ్జెట్ లో బహుమతులు, ఓడిన వారికి శిక్షలు ఉంటాయని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే హరి తేజ, అర్చన, కల్పన, ప్రిన్స్, శివ బాలాజీలు ఒక గ్రూపుగా..మరొక గ్రూప్ గా దీక్ష పంత్, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ఆదర్శ్, ధన్ రాజ్ లను విభజించారు. తొలుత శివబాలాజీ గ్రూప్ ముళ్ల కుర్చీపై కూర్చుంది.
ఈ సమయంలో వారిని దించేందుకు రెండో గ్రూప్ ప్రయత్నించింది. చపాతీ పిండితో తయారు చేసిన బల్లిని అర్చనపై వేయగా, ఆమె గట్టిగా అరిచి, ఏడ్చేసింది. శివబాలాజీని ఆదర్శ్ లేపే ప్రయత్నం చేయగా... కోపిష్టిగా పేరుతెచ్చుకున్న శివబాలాజీ.. ఆదర్శ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక దశలో నీ స్టేచర్ ఏంటి? నా స్టేచర్ ఏంటి? నువ్వా నాతో తలపడేది? అంటూ మండిపడ్డాడు. తరువాత వ్యక్తిగత దూషణకు దిగాడు. దీంతో గట్టిగా సమాధానం చెప్పిన ఆదర్శ్ వ్యక్తిగత దూషణ చేయడంతో ఏడ్చేశాడు.
దీంతో శివబాలాజీ తరపున ధన్ రాజ్ క్షమాపణలు చెప్పారు. అర్చన కూడా ఆదర్శ్ ను అలా అని ఉండకూడదని చెప్పింది. శివబాలాజీ అలా చేయకూడదని హరితేజ సూటిగా చెప్పింది. ధన్ రాజ్ బాత్ రూంకి వెళ్లాలని చెప్పడంతో ముమైత్ ఖాన్ ముళ్ల కుర్చీపై నుంచి లేచింది. దీంతో ఆదర్శ్ టీం ఓటమిపాలైంది. ఈ టీమ్ కి బూట్లు పాలిష్ చేయడం, పాత బట్టలు ఉతకడం వంటి పనులను బిగ్ బాస్ అప్పగించాడు. లగ్జరీ టాస్క్ లో నేడు గెలిచిన టీమ్ కి బహుమతులు ఇవ్వనున్నారు.