: హత్యచేసి.. రక్తంతో మరొకరి పేరు రాసి.. 10 లక్షలు కాజేసిన డ్రైవర్!
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు అనంతరం అతడి రక్తంతో గోడపై మరొకరి పేరు రాసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేసి, వివరాలు వెల్లడించారు. వారణాసిలో అశోక్ గుప్తా అనే వ్యక్తి ఓ ప్రయివేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడని, గత నెల తాను పనిచేస్తోన్న ఆఫీసులోనే ఆయన దారుణ హత్యకు గురయ్యాడని తెలిపారు. హత్య జరిగిన సమయంలో కంపెనీ లాకర్ నుంచి రూ. 10 లక్షలు మాయమయ్యాయని తోటి సిబ్బంది తమకు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఘటనాస్థలిలో గోడపైన రక్తంతో ‘వికాస్’ అనే పేరును గుర్తించినట్లు చెప్పారు.
అయితే, అశోక్‌కు వికాస్ అనే పేరు గల స్నేహితులు ఎవ్వరూ లేరని తెలిసిందని అన్నారు. కంపెనీలో పనిచేసే సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేసి, వారి పూర్తి వివరాలు, ఫోన్ నంబర్‌ను తమ చేత్తో రాసి ఇవ్వాలని సూచించామని పోలీసులు అన్నారు. దీంతో కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ గౌర్ అనే వ్యక్తి చేతిరాత హత్యకు గురయిన వ్యక్తి రక్తంతో గోడపై రాసిన రాతతో సరిపోయిందని పోలీసులు తేల్చారు. గౌతమ్ విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడని అన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గోడపై వికాస్ అనే పేరును రాసి కేసును తప్పుదోవ పట్టించాలనుకున్నట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.