: అర్ధరాత్రి కారులో మహిళను వెంబడించి... నేరుగా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి!


హర్యాణాలో సీనియర్ ఐఏఎస్ అధికారి కూతురు వర్ణికా కుందును ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తనయుడు వికాస్ బరాలా వేధింపులకు గురి చేసిన ఘటన వివాదం ఇంకా చల్లారకముందే... ముంబైలో మరో తీవ్ర వేధింపుల ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తన ఫేస్ బుక్ పేజ్ లో ఈ వేధింపులపై వివరాలు వెల్లడించడంతో ఇది వెలుగు చూసింది. దాని వివరాల్లోకి వెళ్తే... ముంబైలో అదితి నాగ్ పాల్ అనే యువతి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తోంది. పదేళ్లుగా ముంబైలో ఉంటున్న ఆమె తన స్నేహితురాలు, తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్తుండగా, కారులో ఒక వ్యక్తి వెంబడించాడు.

అంతటితో ఆగకుండా రాత్రి 2 గంటల ప్రాంతంలో వారి ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ కూడా కొట్టాడు. అయితే డోర్ దగ్గరున్న సీసీటీవీ కెమెరాను చూసి నెమ్మదిగా దూరం వెళ్లి తచ్చాడి వెనుదిరిగాడు. అతని కళ్లలో ఏమాత్రం భయం కనిపించలేదని, ఈ రాఖీ పండుగ తనకు జన్మలో మర్చిపోలేని అనుభవాన్ని రుచిచూపిందని, ముంబై కూడా మహిళలకు సేఫ్ కాదని ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో అభిప్రాయపడింది. అనంతరం సీసీ పుటేజ్ తో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వేధింపులకు దిగిన వ్యక్తి నితేశ్‌ కుమార్‌ శర్మ (36) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తించి, అరెస్టు చేసినట్టు తెలిపారు. అతనిని అరెస్టు చేసిన వీడియోను కూడా ఆమె తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేశారు. 

  • Loading...

More Telugu News