: మోదీ కూడా నెహ్రూ లాగే హెచ్చరికలు పట్టించుకోవడం లేదు.. 1962 యుద్ధానికి కారణం అదే!: చైనా మీడియా హెచ్చరిక
డోక్లాం సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా అధికారిక మీడియా భారత ప్రభుత్వానికి రోజుకో రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి నేరుగా ప్రధాని మోదీకే హెచ్చరిక చేసింది. 1962లో కూడా చైనా చేసిన హెచ్చరికలను నెహ్రూ పట్టించుకోలేదని, అదే పని మోదీ కూడా చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.
అప్పట్లో నెహ్రూ కూడా చైనా రాజకీయ పరిస్థితులు సరిగా లేవు, దౌత్యవిధానాలు కూడా అంతంత మాత్రమే అని భావించి యుద్ధానికి దిగదులే అని చైనాను తక్కువ అంచనా వేశారని, కానీ ఎన్ని క్లిష్టపరిస్థితులున్నా చైనా తమ భౌగోళిక పరిధి విషయంలో ఇతర దేశాల ప్రమేయాన్ని సహించలేదని ఆయన ఊహించలేకపోయారని ఆ కథనంలో పేర్కొంది. ఆ తర్వాత జరిగిన యుద్ధ పరిణామాలను చవి చూసి కూడా భారత్ ఇంకా అదే రాజకీయనీతిని, అప్పటి రాజకీయ కుయుక్తులనే ఉపయోగిస్తోందని, ఏమాత్రం మార్పు చెందలేదని గ్లోబల్ టైమ్స్ ఆరోపించింది. సిక్కిం ప్రాంతంలోని డోక్లాం సరిహద్దులో భారత్ - పాక్ సైన్యాల మధ్య రోజురోజుకి ఉత్కంఠ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.