: మైక్ కమ్మింగా అమాయకుడట... `ఫ్రీ మైకీ` అంటూ ఆన్‌లైన్‌లో స్నేహితుల ప్రచారం!
డ్రగ్స్ వ్యవహారంలో కీలక నిందితుడిగా పట్టుబడిన నెదర్లాండ్ దేశీయుడు మైక్ కమ్మింగా అరెస్టుపై అతని భార్య, హైదరాబాద్‌కు చెందిన మేరీ స్పందించారు. కమ్మింగా నిర్దోషని, పోలీసులు పొరబడి ఉంటారని, అచ్చం మైక్ లాగే ఉండే వ్యక్తి తమ ప్రాంతంలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాడని మేరీ తెలిపారు. మైక్‌కి వ్యక్తిగతంగా, వృత్తిగతంగా చాలా మంచి పేరుందని, తాను ఎంతోమందికి శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాడని, ఒకసారి వాళ్లందరినీ విచారించి మైక్ గురించి తెలుసుకోండని ఆమె వివరించారు.
కమ్మింగా స్నేహితులు కూడా చాలా మంది అతడు నిర్దోషని అభిప్రాయపడుతున్నారు. అతన్ని కాపాడటం కోసం ఆన్‌లైన్ `ఫ్రీ మైకీ` అనే పేరుతో ప్రచారం కూడా ప్రారంభించారు. వారంతా కమ్మింగాతో తమకున్న పరిచయం గురించి, అతని వ్యక్తిత్వం, మంచితనం గురించి వివరిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పోలీసులు మాత్రం, అరెస్టు చేయడానికి వెళ్లినపుడు కమ్మింగా నానా హంగామా సృష్టించాడని, ఫోన్లో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నించాడని, ఇప్పుడు కూడా విచారణకు సహకరించడం లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం కమ్మింగా తన ఉద్యోగంతో పాటు భారత దేశంలో అధికారికంగా నివసించే హక్కును కూడా కోల్పోయాడు. అతనికి, మేరీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కమ్మింగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు మీడియాలో విచ్చలవిడిగా ప్రసారం చేస్తున్నారని, స్వతహాగా అతను చాలా మంచివాడని, దయచేసి అతని గురించి తప్పుడు అభిప్రాయం కలిగేలా ప్రసారాలు చేయొద్దని మైక్ స్నేహితుడు లూకస్ తన వీడియోలో కోరాడు.