: తండ్రి వీడియో గేమ్ కొనివ్వడంలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య!
తనకు వీడియో గేమ్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతున్న ఓ విద్యార్థి ఈ రోజు ఉదయం తమ రెండంతస్తుల భవనం ఎక్కి దూకేసిన ఘటన హైదరాబాద్ శివారులోని కుంట్లూరులో చోటు చేసుకుంది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే కుంట్లూరులో నివసించే శ్రీనివాస్, పద్మ దంపతులకు అభినయ్ అనే బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు ఉన్నాడు. ఇటీవలే వారు కొత్తగా రెండంతస్తుల భవనం కట్టుకున్నారు. ఈ నెల 2న నాదెర్గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో అభినయ్ చేరాడు.
వీడియో గేమ్ లు ఆడడం అంటే ఎంతో ఇష్టం చూపించే ఆ విద్యార్థి కొన్ని రోజులుగా తనకు దాన్ని కొనివ్వాలని తండ్రిని అడుగుతున్నాడు. కానీ తమ వద్ద డబ్బులేదని తండ్రి చెప్పుకొస్తున్నాడు. తనకు వీడియో గేమ్ కొనిస్తారా? లేదా? అంటూ నిన్న తనతో గొడవకు దిగిన ఆ బాలుడిని అతడి తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురయిన ఆ బాలుడు తమ భవనం పైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.