: ఎవరెస్ట్ ఎక్కినట్లు అబద్ధం చెప్పిన కానిస్టేబుల్ జంటపై డిస్మిస్ వేటు!
ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి జంట తామే అంటూ ఫొటోలు మార్ఫింగ్ చేసి, పోలీసు శాఖను తప్పుదోవ పట్టించిన కానిస్టేబుల్ జంటను మహారాష్ట్ర పోలీసు విభాగం విధుల్లోంచి డిస్మిస్ చేసింది. గత నవంబర్‌లోనే వీరి మీద సస్పెన్షన్ విధించిన పోలీసు విభాగం, మూడు నెలల క్రితం ఈ జంటను, ఎందుకు డిస్మిస్ చేయకూడదంటూ షోకాజ్ నోటీసులు పంపింది. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వారిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు ఏసీపీ సాహబ్‌రావ్ పాటిల్ చెప్పారు.
గతేడాది మేలో తాము ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, అందుకు సంబంధించిన ఆధారాలుగా ఫొటోలను చూపించారు. అయితే అవి మార్ఫ్‌డ్ ఫొటోలని, అసలు ఈ జంట నేపాల్ రాలేదని స్థానికులు చెప్పినట్లు విచారణలో తేలింది. అలాగే గత ఆగస్ట్‌లో వీరిని 10 ఏళ్ల పాటు నేపాల్ రాకుండా నిషేధం విధిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.