: ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ వంతు.. హెచ్చార్సీలో ఫిర్యాదు
విలక్షణ నటుడు కమలహాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ బిగ్ బాస్ రియాల్టీ షోపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ వంతు వచ్చింది. షోలో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్ లకు విధిస్తున్న శిక్షలు అమానవీయంగా ఉన్నాయని సామాజిక కార్యకర్త అచ్యుతరావు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన పిటిషన్ లో పలు అభ్యంతరాలను ఆయన వ్యక్త పరిచారు.
ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ లు చేస్తున్న పనులు యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పిటిషన్ లో ఆయన ఆరోపించారు. శిక్షల పేరుతో స్విమ్మింగ్ పూల్ లో 50 సార్లు మునిగి లేవమనడం, రాత్రి పూట గార్డెన్ లో పడుకోమనడం, నోటికి ప్లాస్టర్లు వేయడం, గంటల తరబడి ఉల్లిపాయలు కోయమనడం లాంటి ఎన్నో దారుణ శిక్షలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్క్ లు కూడా దారుణంగా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ కూడా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని చెప్పారు. ఈ పిటిషన్ పై ఇంకా హెచ్చార్సీ స్పందించలేదు. విచారణకు స్వీకరిస్తే, బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.