: భారత్ నుంచి ట్రంప్‌కు 1001 రాఖీలు... తమ ఊరికి రావాలని ట్రంప్ గ్రామస్తుల వినతి!
హర్యానాలోని మేవార్ ప్రాంతానికి చెందిన మారోరా గ్రామానికి `ట్రంప్ గ్రామం`గా సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ అనధికారిక నామకరణం చేసిన సంగతి తెలిసిందే. రాఖీ పండగ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన యువతులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ పెద్ద సోదరుడిగా భావిస్తూ 1001 రాఖీలు తయారు చేసి పంపారు.
అలాగే ప్రధాని మోదీకి కూడా 501 రాఖీలు తయారుచేసి పంపారు. వారిద్దరూ కలిసి తమ గ్రామాన్ని సందర్శించాలని వారికి లేఖలు రాశారు. ఆగస్టు 7 రాఖీ పండగలోగా ఆ రాఖీలు ట్రంప్ కు చేరాలని శుక్రవారం రోజే వాటిని పోస్ట్ చేశారు. ఇటీవల ప్రధాని మోదీ సూచించిన `బహిరంగ మలవిసర్జన నివారణ` ఆశయ సాకారంలో భాగంగా సులభ్ వారు ఈ గ్రామంలో 95 టాయ్‌లెట్లు నిర్మించారు. ఈ గ్రామంలో ఉన్న 140 ఇళ్లల్లో 45 కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉండేవని, మిగతా 95 ఇళ్లల్లో తాము నిర్మించామని సులభ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి తెలియజేశారు.