: తండ్రి చితి ఆరకముందే పదవి కోసం వెళ్లిన నువ్వా, సంప్రదాయాల గురించి మాట్లాడేది?: అఖిలప్రియపై రోజా ఫైర్
తండ్రి చితి ఆరకముందే మంత్రి పదవి కోసం సంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కిన నువ్వా, సంప్రదాయం గురించి మాట్లాడేది? అంటూ మంత్రి అఖిలప్రియపై వైఎస్సార్సీపీ నేత రోజా ధ్వజమెత్తారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా రోజా ప్రచారానికి వెళ్లిన సమయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం రోజా మాట్లాడుతూ, చివరి రక్తపు బొట్టు వరకు శోభానాగిరెడ్డి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు.
భూమా నాగిరెడ్డి మరణానికి కారణం ఎవరో తెలుసుకోవాలని అఖిల ప్రియకు రోజా సూచించారు. 'సొంత మామ ఎస్వీ మోహన్ రెడ్డి నీ ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా చేసుకున్నావని' ఆమె మండిపడ్డారు. జగన్ నైతికతను ప్రశ్నించే ముందు నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవాలని రోజా, అఖిలప్రియకు సూచించారు. నంద్యాలకు ఏం చేశారో చెప్పలేక, తల్లిదండ్రుల పేర్లు చెప్పి సానుభూతితో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నావని రోజా మండిపడ్డారు. ఏ పార్టీ కార్డుతో గెలిచి, ఏ పార్టీలో ఉన్నావో గుర్తుంచుకోవాలని చెబుతూ, నంద్యాల ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నది గ్రహించాలని ఆమె సూచించారు.