: గుజరాత్ లో రాహుల్ గాంధీ కాన్వాయ్ పై రాళ్ల దాడి!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లోని వరదబాధితులను పరామర్శించేందుకు నేడు ఆయన బనస్కాంత తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బనస్కాంతలో ఆయన వరద బాధితులను ఉద్దేశించి మాట్లాడుతుండగా... కొందరు ఆయనకు నల్ల జెండాలు చూపిస్తూ, నిరసన వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన రాహుల్ వారిని తన వద్దకు రానివ్వాలని కోరారు. నిరసనకారులు కొంచెం ఆందోళనలో ఉన్నారని, తనకు ఎలాంటి భయం లేదని అన్నారు.
కాగా, కార్యక్రమం అనంతరం కొందరు వ్యక్తులు రాహుల్ కాన్వాయ్ లోని ఓ కారుపై రాళ్లు విసిరారు. దీంతో, ఆ కారు వైనుకవైపు అద్దాలు పగిలిపోయాయి. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఉంచిన సంగతి తెలిసిందే. నిరసనకారుల ఆందోళనకు కారణం ఇదే. ఇదే విషయం గురించి నిరసనకారులు మాట్లాడుతూ, ఎమ్మెల్యేలను వేరే చోట ఉంచి, మీరు మాత్రమే ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మరోవైపు, ఆందోళనకారుల చర్యలను బీజేపీ ఖండించింది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు.