: మేమూ ప్రతీకారానికి దిగుతాం!: అమెరికాకు రష్యా వార్నింగ్
అమెరికాకు రష్యా తీవ్ర హెచ్చరికలు చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలతో పాటు ఉక్రెయిన్ లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిందని పేర్కొంటూ రష్యాపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తూ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న సంతకం చేశారు. ఈ నేపథ్యంలో రష్యా తీవ్రంగా స్పందించింది.
అమెరికా ఒంటెత్తు పోకడలకు పోతోందని రష్యా మండిపడింది. ఇలా ఆంక్షలు విధించడం సరికాదని సూచించింది. ఇది చాలా ప్రమాదకరమైన విధానమని, రష్యాపై అమెరికా చిన్న చూపును సూచిస్తోందని తెలిపింది. ఇలాంటి ఆంక్షల వల్ల ప్రపంచ సుస్థిరతకు భంగం వాటిల్లే ప్రమాదముందని పేర్కొంది. ఉక్రెయిన్ విషయంలో తాము చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నప్పటికీ, ఆమెరికా పట్టించుకోవడం లేదని అన్నారు. అమెరికా ఇలాగే ప్రవర్తిస్తే, తాము కూడా ప్రతీకార చర్యలకు దిగాల్సి ఉటుందని హెచ్చరించింది.