: చంద్రబాబు కౌరవ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలి: వైఎస్ జగన్
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ అంతటా ఇక్కడి నడిరోడ్లపైనే తిరుగుతున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాలలో జరుగుతున్న వైసీపీ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఇక్కడి రోడ్లపైనే తిరుగుతున్నారని అన్నారు. వీళ్లిద్దరూ కలిసి అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారని, మోసపూరిత జీవోలు చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అయివుంటే, చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ఒక్క రూపాయి అయినా ఇచ్చేవారా? అని ప్రశ్నించారు.
‘నంద్యాల ఉపఎన్నిక ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న యుద్ధమిది. విశ్వసనీయ రాజకీయాలకు, వంచనతో కూడిన రాజకీయాలకు మధ్య జరుగుతున్న యుద్ధమిది .. దుర్మార్గపు పాలన చేస్తున్న చంద్రబాబు పాలనపై చేస్తున్న యుద్ధం ఈ ఉపఎన్నిక’ అని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ ఉపఎన్నికల్లో చంద్రబాబు దోచుకున్న డబ్బుల్లో కొంత వెదజల్లి, అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలవాలని చూస్తున్నారు. 2019లో జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నాంది నంద్యాల ఉపఎన్నిక. ఈ ఎన్నికల్లో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయుధం పట్టక్కర్లేదు..ప్రజలెవ్వరూ యుద్దం చేయక్కర్లేదు.. ఈ ఎన్నికల్లో ప్రజలు వారి చూపుడు వేలుతో ఈవీఎం అనే బటన్ నొక్కుతూ, ఈవీఎం అనే విష్ణు చక్రాన్ని తిప్పుతూ.. చంద్రబాబు నాయుడి కౌరవ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలి’ అని జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.