: భారత్ పై అణ్వస్త్రాలను ప్రయోగించాలనుకున్నా.. కానీ, భారత్ ఎదురుదాడికి దిగితే పరిస్థితి ఏంటని వెనక్కి తగ్గా: ముషారఫ్
పాకిస్థాన్ అధ్యక్షుడిగా తాను ఉన్నప్పుడు భారత్ పై అణ్వస్త్రాలతో దాడి చేద్దామనే ఆలోచన తనకు వచ్చిందని... అయితే, భారత్ ఎదురుదాడికి దిగితే పరిస్థితి ఏంటనే ఆలోచనతో వెనక్కు తగ్గానని ముషార్రఫ్ అన్నారు. బీబీసీ ఉర్దూ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికపాలనలోనే భారత్ పై పాక్ ప్రాబల్యం ఎక్కువగా ఉందని... ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలతో అంతా నాశనం అయిందని చెప్పారు.
సైనిక పాలకులు అయూబ్ ఖాన్, జియా ఉల్ హక్ ల పాలనలో పాక్ సరైన మార్గంలో నడిచిందని అన్నారు. భారత్ తో సంబంధాలు అంటూ ఎన్నో విషయాలలో నవాజ్ షరీఫ్ పైచేయి సాధించలేకపోయారని చెప్పారు. నియంతల పాలనలో ఉన్న ఆసియా దేశాలు ఎంతో పురోగతిని సాధించాయని తెలిపారు. ఆర్మీ చీఫ్ లు ప్రజల హక్కులను రక్షిస్తే... ప్రజల చేత ఎన్నికైన నేతలు మాత్రం దేశాన్ని నాశనం చేశారని చెప్పారు.