: ఎమ్మెల్యేగా కాకుండా, ఎమ్మెల్సీగా వెళ్లిన కారణాన్ని అందరికీ నచ్చేలా చెప్పిన లోకేష్!
ఓ ముఖ్యమంత్రికి కుమారుడిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా, అపారమైన కార్యకర్తల బలమున్న నారా లోకేష్, ప్రజల చేత ఎన్నుకోబడి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి, మంత్రివర్గంలోకి అడుగు పెట్టకుండా, ఎమ్మెల్సీగా ఎన్నికైన వైనంపై ఓ టీవీ చానల్ ప్రశ్నించిన వేళ, లోకేష్ చెప్పిన సమాధానం అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఉంది. కౌన్సిల్ కు వెళ్లడమంటే అంత చిన్న చూపా? అని ప్రశ్నించిన లోకేష్, పార్టీ ఏం చెబితే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.
అంతేకాకుండా, "నాకు ఎమ్మెల్యే పదవి కోసం మరో ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి బలిచేయాలా? ఎందుకు చేయాలి నేనట్లా? అది తప్పు. నేనా తప్పు చేయనసలు. నావల్ల ఒకరు ఇబ్బంది పడకూడదన్నది నా ఉద్దేశం" అని అన్నారు. తాను ప్రజా సేవ చేసేందుకు వచ్చానని, అది ఏమార్గంలోనైనా ఒకటేనని చెప్పారు. తాను ఏం మాట్లాడినా తప్పని అనడం ప్రతిపక్షాల నైజమని, తన పని తాను చేసుకుంటూ వెళతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే, పోటీ చేస్తానని అన్నారు.