: శ్రీలంకతో రెండో టెస్టుకి కేఎల్ రాహుల్ ఆగమనం?
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుకి కర్ణాటక బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను బరిలోకి దింపనున్నట్లు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇందుకు గాను ప్రస్తుతం ఆడుతున్న శిఖర్ ధావన్‌ను గానీ, అభినవ్ ముకుంద్‌ను గానీ తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎవరి స్థానంలో రాహుల్‌ను తీసుకువస్తున్నారో అనే విషయంపై విరాట్ స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే ఈ నిర్ణయానికి జట్టు మొత్తం మద్దతు పలుకుతుందని ఆయన ఆశిస్తున్నాడు.
ప్రస్తుతం అందరు ఆటగాళ్లు బాగానే ఆడుతున్నా, ఆట మీద ఎక్కువ ప్రభావం చూపించగలిగే వారిని ఎన్నుకోవడం ముఖ్యం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విరాట్ తెలిపాడు. రాహుల్‌ను జట్టులోకి తీసుకురావడంపై భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాహుల్ ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ని తాను గమనిస్తున్నట్లు రవిశాస్త్రి తెలిపారు. రెండో టెస్టులో భారత ఆటగాళ్ల నుంచి అత్యద్భుత ప్రదర్శన ఆశించవచ్చని విరాట్ హామీ ఇచ్చాడు.