: కొత్త నియమాలు వచ్చిన గంటల్లోనే వెయ్యికి పైగా కేసులు!
ట్రాఫిక్ ఉల్లంఘనల నివారణ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లో ప్రవేశ పెట్టిన పాయింట్ల విధానం అమల్లోకి వచ్చిన గంటల్లోనే 1,065 కేసులు నమోదయ్యాయని, ఈ కేసుల్లో పట్టుబడిన వారికి మొత్తంగా 1,188 పాయింట్ల జారీ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ వి. రవీందర్ పేర్కొన్నారు. వాహన చోదకుల్లో స్వయం నియంత్రణ పెంపొందించడం కోసం ఈ పాయింట్ల విధానాన్ని దేశంలో మొదటిసారిగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలలో పట్టుబడిన వారికి 1 నుంచి 5 పాయింట్లు జారీ చేస్తారు. ఇలా ఎక్కువ సార్లు పట్టుబడి 12 పాయింట్లకు చేరుకున్న వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఈ పాయింట్లతో పాటు సంబంధిత ఉల్లంఘనకు చెందిన జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.