: తాగునీటి కోసం అల్లాడిపోతున్న చెన్నై వాసులు!


దక్షిణాది రాష్ట్రాల్లో చెన్నైవాసులు పడుతున్నన్ని కష్టాలు మరెవరూ పడటం లేదంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు అతలాకుతలం చేస్తున్న తుపానులు, మరోవైపు తాగు నీటి కష్టాలు వీరికి అంతులేని ఆవేదనను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలో తాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. చెన్నై మహానగరానికి తాగునీటిని అందించే పూండి, చెంబరంపాక్కం, పుళల్ చెరువులు అడుగంటి పోవడంతో... ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాళ్ల క్వారీల్లో ఉన్న వర్షపు నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నీటి నిల్వలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.

ఈ నేపథ్యంలో, చెన్నై మహానగరంలో ఏ వీధిలో చూసినా తాగునీటి కుళాయిల వద్ద ఖాళీ బిందెలు క్యూలలో కనిపిస్తున్నాయి. రోడ్ల మీద సైకిళ్లు, ఆటోలు, మూడు చక్రాల సైకిళ్లు నీళ్ల బిందెలతో వెళుతున్న దృశ్యాలు సర్వసాధారణమైపోయాయి. బోర్లలో నీరు రాకపోవడంతో చెన్నైవాసుల కష్టాలు మరింత పెరిగాయి. దీంతో, మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేస్తున్న ట్యాంకర్లపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. అయితే, బోర్డు సరఫరా చేస్తున్న నీరు జనాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. నీటి కోసం గొడవలు నిత్యకృత్యమై పోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News