: ఓ యువతికి అపాయింట్ మెంట్ ఆర్డర్ పంపి, ఆఫీసుకు రప్పించుకుని కేపీఆర్ ఐసీ యజమాని అత్యాచారం!
ఉద్యోగం వచ్చిందని ఓ యువతికి అపాయింట్ మెంట్ ఆర్డర్ పంపి, ఆమె ఆఫీసుకు వచ్చిన తరువాత మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిపై పోలీసు కేసు నమోదైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కేపీఆర్ ఇంటర్ కాంటినెంటల్ (కేపీఆర్ ఐసీ) పేరిట కంపెనీని నడుపుతున్న రాజశేఖరరెడ్డి, తన సంస్థలో పని చేసేందుకు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చాడు. దాన్ని చూసిన ఓ యువతి (29) అప్లికేషన్ పెట్టుకుంది. ఇంటర్వ్యూ అనంతరం సెలక్టయినట్టు చెబుతూ లెటర్ పంపించాడు. ఆపై జీతం గురించి మాట్లాడేందుకు రమ్మన్నాడు.
ఆమె వెళ్లిన తరువాత, ఆఫీసు సిబ్బంది ఆమెకు గులాబ్ జామ్, జ్యూస్ ఇచ్చారు. ఆపై కాసేపటికి యువతి స్పృహ తప్పింది. ఆమెను ఆఫీసులోని తన గదికి తీసుకెళ్లిన రాజశేఖరరెడ్డి అత్యాచారం చేసి, నగ్న దృశ్యాలను ఫోటోలు తీశాడు. స్పృహ వచ్చిన తరువాత యువతి ఇంటికి వెళ్లగా, ఫోన్ చేసిన రాజశేఖరరెడ్డి, విషయం బయటకు చెబితే, అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. కొన్ని రోజులు భయపడిన ఆమె, చివరికి ధైర్యం చేసి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.