: బాలకృష్ణకు నేను ఎంతగా అభిమానిని అంటే..!: దర్శకుడు పూరీ జగన్నాథ్
హీరో బాలకృష్ణకు తాను ఎంతగా అభిమానిని అంటే... జూబ్లీహిల్స్ లో కనుక బాలకృష్ణకు అభిమాన సంఘం ఉంటే దానికి తానే అధ్యక్షుడిని అవుతానని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన అభిమానాన్ని చాటుకున్నారు. పూరీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను స్టంపర్ క్యాప్షన్ తో విడుదల చేసిన పూరీ, ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మరింత వెరైటీగా చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు బాలకృష్ణ అభిమాన సంఘాల అధ్యక్షులు, కన్వీనర్లతో భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ ఈ రోజు ఓ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన పూరీ మాట్లాడుతూ, బాలకృష్ణతో సినిమా చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, మరో సినిమా కూడా చేయాలని ఉందని, తన కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ‘పైసా వసూల్’ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని పూరీ పేర్కొన్నారు. కాగా, ఈ సంద్భరంగా 101 మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలని తాము నిర్ణయించామని ఆనంద్ ప్రసాద్ పేర్కొన్నారు. బాలయ్య అభిమాన సంఘాల అధ్యక్షులు, కన్వీనర్ల సాయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అనుకుంటున్నామని చెప్పారు.