: చంపుతామంటూ దర్శకురాలు దివ్యభారతికి బెదిరింపులు!
తమిళనాడుకు చెందిన లఘుచిత్ర దర్శకురాలు దివ్యభారతికి చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయి. బీజేపీ, పుదియతమిళగం పార్టీలకు చెందిన వారు తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. 2009లో లా కాలేజీ విద్యార్థి సురేష్ పాము కాటుకు గురై చనిపోయాడు. ఈ నేపథ్యంలో, అతని కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలంటూ ఆమె మధురై ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పోరాటం చేశారు. దీనికి సంబంధించిన కేసులో ఆమె అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా తనకు ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. లెనినిస్ట్ సంఘంలో కూడా ఆమె పని చేస్తున్నారు.
తాను నిర్మించిన 'కక్కూస్' అనే షార్ట్ ఫిల్మ్ ను తప్పుగా అర్థం చేసుకునే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని దివ్యభారతి తెలిపారు. తనకు ఫోన్ చేసిన వారిని ఎవరు అని అడిగితే... వారు బీజీపీ, పుదియతమిళం పార్టీలకు చెందిన వారమని చెప్పారని ఆమె అన్నారు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని కోరారు. పుదియతమిళం పార్టీ నేత కృష్ణస్వామికి బుద్ధి చెప్పాలని అన్నారు. పశుమాంసం ఇతివృత్తంగా షార్ట్ ఫిల్మ్ ను రూపొందించినందుకే బీజేపీ తనను టార్గెట్ చేసిందని తెలిపారు.