: విక్రమ్ కేసును పోలీసులు ఎలా ఛేదించారంటే...!


మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కేసును పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం తెల్లవారు జామున దుండగులు కాల్పులు జరిపారంటూ అపోలో ఆసుపత్రిలో విక్రమ్ గౌడ్ చేరిన సంగతి తెలిసిందే. అయితే హత్యాయత్నం జరిగిందని బాధితులు చెబుతున్నప్పటికీ ఆత్మహత్యాయత్నంగా అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విక్రమ్ గౌడ్ భార్య షిపాలి అబద్ధం చెబుతున్నారని పేర్కొన్నారు. అనంతరం విక్రమ్ గౌడ్ వాంగ్మూలం తీసుకుని, వారిద్దరూ చెప్పినదానికి పొంతన కుదరడం లేదని గుర్తించారు.

అలాగే విక్రమ్ గౌడ్ తనపై బయటి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని తెలిపారు. దీంతో బయటి నుంచి కాల్పులు జరిపితే అతని భుజంపై బుల్లెట్ దిగే అవకాశం లేదని గుర్తించి నిర్ధారించుకున్నారు. అలాగే బయటి నుంచి తుపాకీ కాల్పులు జరిపితే తుపాకీ తూటా తలుపు బయటివైపు నుంచి దూసుకెళ్లాల్సి ఉంటుందని, కానీ తూటా తలుపు లోపలివైపు నుంచి వెళ్లిందని పేర్కొన్నారు.

దీంతో ఇది బయటి నుంచి జరిగిన కాల్పుల వ్యవహారం కాదని నిర్ధారించుకున్నారు. షిపాలి మాత్రమే తనను ఆసుపత్రికి తీసుకెళ్లిందని విక్రమ్ పోలీసులకు చెప్పారు. అయితే, కారులోంచి నలుగురు వ్యక్తులు దిగి విక్రమ్ గౌడ్ ను అపోలో ఆసుపత్రిలో చేర్చిన పుటేజ్ ను పోలీసులు సేకరించారు. అనంతరం వారెవరని ఆరాతీశారు. అలాగే విక్రమ్ గౌడ్ కాల్ లిస్ట్, వాట్స్ యాప్ మెసేజ్ లు, ఇతర వివరాలు పరిశీలించిన పోలీసులు ఇందులో వాడిన ఆయుధం దిశగా దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు విక్రమ్ గౌడ్ టెలిఫోన్ సంభాషణలు, మెసేజ్ లు, వాట్స్ యాప్ సంభాషణల ద్వారా నిందితులను అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై పోలీసులు ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News