: భారీ వర్షం.. కుమ్మేస్తున్న వడగళ్లు.. శరీరం గాయాల పాలవుతున్నా రిపోర్టింగ్ ఆపని మహిళ.. నెటిజన్లు ఫిదా!


విధి నిర్వహణలో అంకితభావానికి ఆ రిపోర్టర్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. లైవ్ రిపోర్టింగ్‌కు వెళ్లిన ఆ మహిళా రిపోర్టర్ ఓ వైపు భారీ వర్షం, మరోవైపు పెద్ద పెద్ద వడగళ్లు నెత్తిపై పడుతున్నా రిపోర్టింగ్‌ను మాత్రం ఆపలేదు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టర్కీలోని ఇస్తాంబుల్‌లో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో స్థానిక న్యూస్ చానల్‌కు చెందిన మహిళా రిపోర్టర్ లైవ్ కవరేజీ కోసం వెళ్లింది. రెయిన్ కోట్ వేసుకుని రిపోర్టింగ్ ఇస్తోంది. అప్పటికే వర్షం పడుతోంది. మరోవైపు భారీ పరిమాణంలో ఉన్న వడగళ్లు కూడా పడుతున్నాయి. అవి నేరుగా నెత్తిని తాకుతున్నా ఆమె మాత్రం రిపోర్టింగ్ మానలేదు సరికదా, వాతావరణ పరిస్థితిని చక్కగా వివరించింది.

వడగళ్ల నుంచి తప్పించుకునేందుకు చేతిని అడ్డుపెట్టుకుంటున్న ఆమెను చూసిన స్టూడియోలోని న్యూస్ యాంకర్ ఆమెను సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెబుతున్నా ఆమె పట్టించుకోకుండా రిపోర్టింగ్ చేస్తూనే ఉంది. వడగళ్లు శరీరానికి బలంగా తాకుతున్నా ఆ బాధను కనిపించనీయకుండా జాగ్రత్తపడింది. ఆమెను చూసిన ఓ వ్యక్తి గొడుగు తెచ్చి పట్టాడు. ఈ వీడియోను న్యూస్ చానల్ సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అయింది. రిపోర్టర్ అంకితభావానికి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

  • Loading...

More Telugu News