: షాక్ కు గురైన శాస్త్రవేత్తలు... 'రోబో' సినిమాలోని ఘటన వాస్తవ రూపం దాల్చింది!


తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రముఖ దర్శకుడు శంకర్ తీసిన ‘రోబో’ సినిమాతో పాటు ఇంగ్లీష్ లో రూపొందిన 'ఐ రోబోట్' సినిమాలో సమాజ శ్రేయస్సుకోసం రూపొందించిన రోబోలు చివరికి ఎదురు తిరిగి కృత్రిమ మేధస్సుతో సొంత ప్రపంచాన్ని సృష్టించుకుని, తమను తయారు చేసిన వారిని అంతం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు ఏకంగా మానవాళికి ప్రమాదకారంగా మారడాన్ని వెండితెరపై చూశాం. అయితే అదే రీతిన కాకున్నప్పటికీ ఇంచుమించు అలాంటి ఘటనే చోటుచేసుకుని శాస్త్రవేత్తలను బెంబేలెత్తించిన ఘటన అమెరికాలోని వాషింగ్టన్ లో చోటుచేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే... సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ కృత్రిమ మేధస్సు (ఏఐ)తో రోబోను తయారు చేసే ప్రాజెక్టు చేపట్టింది. ఫేస్‌ బుక్‌ ఏఐ పరిశోధక ప్రయోగశాల (ఫెయిర్‌) ఏఐబోట్‌ సంభాషించగల రోబోలను తయారుచేసింది. దీనిని మరింత విస్తృతపరిచే క్రమంలో ఈ రోబోల కోసం ప్రత్యేకమైన అల్గారిధమ్ ను ఉపయోగించి, అవి స్వేచ్ఛగా మాట్లాడుకునేలా చేశారు. దీంతో ఈ భాషను నేర్చుకున్న రోబోలు మరింత వేగంగా సొంత ఆల్గారిధమ్ తో సొంత భాషను తయారు చేసుకున్నాయి. ఇందులో మానవ ప్రమేయం లేదా ప్రయత్నం ఏమాత్రం లేకపోవడం విశేషం. దీంతో మానవులకు అర్థం కాని భాషలో అవి సంభాషించుకోవడం మొదలు పెట్టాయి. అంతే కాకుండా మానవులు వాటికి సూచనలు ఇచ్చే ఆంగ్లభాషను వాడడం మానేసి, అవి రూపొందించుకున్న కొత్త భాషను వినియోగించడం మొదలు పెట్టాయి.

దీంతో శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలకు స్పందించడం మానేశాయి. దీంతో శాస్త్రవేత్తలు షాక్ కు గురయ్యారు. గతంలో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్స్ వ్యక్తం చేసిన... కృత్రిమ మేధస్సుతో పెను ప్రమాదం పొంచి ఉందన్న వ్యాఖ్యలను గుర్తు చేసింది. అలాగే వాటిని అభివృద్ధి చేయడం ప్రమాదకరమని, మందగమనంలో సాగే జీవ పరిణామ క్రమాన్ని రోబోలు వేగంగా అధిగమించేస్తాయని, అది దారుణాలకు దారితీస్తుందని ఈ ప్రాజక్టు రూపకల్పన సమయంలో హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దాంతో వెంటనే ఈ ప్రాజెక్టును షట్ డౌన్ చేసేశారు.

కాగా, గతంలో జుకెర్ బర్గ్ ఈ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో ఎలాన్‌ మస్క్‌, వితరణశీలి బిల్‌ గేట్స్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జుకెర్ బర్గ్ తో ఎలాన్ మస్క్ కు సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. కృత్రిమ మేధస్సుకు సంబంధించి నియంత్రణ, రక్షణ చర్యలు అవసరమని మస్క్‌ పేర్కొనగా, పెను వినాశనం జరుగుతుందని భయాందోళనలు రేకెత్తించడం బాధ్యతారాహిత్యమంటూ జుకెర్ బర్గ్ ఘాటుగా సమాధానం చెప్పారు. దీంతో కృత్రిమ మేధస్సుపై జుకెర్‌ బర్గ్‌ కు పరిమిత అవగాహన ఉందని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలతో ఆ ప్రాజెక్టును షట్ డౌన్ చేసేశారు.

  • Loading...

More Telugu News