: అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను... వారంలో మూడు రోజులు రాజకీయాలే!: పవన్ కల్యాణ్
అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో జనసేన పార్టీ శ్రేణుల ఎంపిక పూర్తయిందని అన్నారు. ఏపీలో రెండు జిల్లాలు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అది అక్టోబర్ కి పూర్తవుతుందని చెప్పారు. సమర్థులైన యువకులను ఎంచుకుంటున్నామని ఆయన తెలిపారు. అది పూర్తయిన తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, వారంలో మూడు రోజులు రాజకీయాలకు కేటాయిస్తానని అన్నారు. గంగపర్రు, పశ్చిమగోదావరి జిల్లాలోని తందుర్రు ఆక్వాపార్క్ ఘటనలపై స్పందించకపోవడానికి కారణమేంటంటే...ఆ రెండూ సున్నితమైన అంశాలని అన్నారు.
ఆ సమస్యల సమయంలో తాను వచ్చి ఉంటే తనకు మద్దతుగా వచ్చే ఎందరో యువకుల్లో సంఘవిద్రోహ శక్తులు ఉండే అవకాశం ఉందని అన్నారు. వారి వల్ల శాంతి భద్రతల సమస్యలు ఉంటాయని చెప్పారు. అందుకే తాను ఆ సందర్భాల్లో రాలేదని చెప్పారు. అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు లకు కులాలు అంటగట్టడం సమంజసం కాదని ఆయన సూచించారు. ఆక్వాఫుడ్ పార్క్ లో నిబంధనలన్నీ అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు అమలవుతున్నాయా? అని అడిగారు. ప్రతి సమస్య పోలీసులతో అణచివేస్తే సరిపోతుందని ప్రభుత్వం భావించడం సరికాదని ఆయన చెప్పారు.