: కన్నడ భాషను కించపరిస్తే ఊరుకునేది లేదు!: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక రాష్ట్రానికి వచ్చేవారు తమ సంస్కృతికి అలవాటు పడాలే కానీ కించపరచకూడదని, అలా చేస్తే ఊరుకునేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆ రాష్ట్ర అధికార కాంగ్రెస్ ప్రభుత్వం యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన 14 నిమిషాల వీడియోలో ఆయన ఈ మాటలు అన్నారు. ఈ వీడియోలో కన్నడ ప్రజల నాయకుడిగా సిద్ధరామయ్యను చూపించారు.
`మా పొరుగు రాష్ట్రాల ప్రజల్ని మేం సోదరుల్లా భావిస్తాం. అది మా బాధ్యత. అలాగని మా భాష, నీరు, భూమిని కించపరిస్తే ఊరుకుంటామని అనుకోవద్దు. మన భాష పట్ల కన్నడిగులంతా గర్వపడాలి` అని సిద్ధరామయ్య వీడియోలో పేర్కొన్నారు. భాషపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉండే గౌరవాన్ని వ్యక్తం చేయడానికే `కర్ణాటక నమ్మ హెమ్మె (కర్ణాటక, మా గౌరవం)` అనే పేరుతో ఈ వీడియోను రూపొందించినట్లు ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు.