: ఆదాయపు పన్ను చెల్లింపు గడువు పొడిగింపు... చివరి తేదీ ఆగస్ట్ 5
2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లింపు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పన్ను చెల్లింపులు చేసే వెబ్‌సైట్ మీద అధిక భారం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ భారం తగ్గించడానికి జూలై 31గా ఉన్న చివరి తేదీని ఆరు రోజులు పెంచారు. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించడానికి పాన్‌కార్ట్‌ను ఆధార్‌తో లింక్ చేయాలన్న నిబంధన ఉండటంతో గడువు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, సైట్‌పై భారం పెరుగుతున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రతినిధి చెప్పారు. మరో ఆరు రోజులు గడువు పెంచడం వల్ల చెల్లించాల్సిన వారు త్వరగా చెల్లించే సదుపాయం కలుగుతుందని వివరించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వాళ్లందరూ తప్పకుండా రిటర్నులు వేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది.