: న్యూ యాంగిల్... విక్రమ్ పై కాల్పుల ఘటనలో అనంతపురం కిరాయి హంతక ముఠా?
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకూ విక్రమ్ ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉండవచ్చని, లేకుంటే ఇంట్లోని వారే ఎవరో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తుండగా, ఇప్పుడు దీని వెనుక అనంతపురానికి చెందిన కిరాయి హంతక ముఠా ఒకటి ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. విక్రమ్ కు శత్రువులుగా ఉన్న ఎవరో సుపారీ ఇచ్చి ఆయన్ను హత్య చేయించేందుకు కుట్ర పన్ని ఉంటారన్న కోణంలో దర్యాఫ్తు మొదలైంది.
విక్రమ్ ఇంటికి చడీ చప్పుడు కాకుండా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు ఉపయోగించిన తుపాకిని తీసుకుపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం ప్రత్యేక బృందం అనంతపురానికి బయలుదేరి వెళ్లింది. కాల్పుల ఘటనకు ముందు రోజు విక్రమ్, అనంతపురంకు చెందిన వారితో మాట్లాడాడని అతని కాల్ రికార్డు చెబుతుండగా, వారికి విక్రమ్ పెద్ద మొత్తంలో డబ్బు బకాయి పడ్డాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.