: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన బీసీసీఐ!
ఇటీవలి కాలంలో వివిధ వివాదాలతో బలహీనపడ్డట్టు కనిపించిన బీసీసీఐని ఇబ్బంది పెట్టాలని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) భావించిన వేళ, వారికే షాకిచ్చే నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకునేలా ఉంది. దక్షిణాఫ్రికాలో వెంటనే భారత జట్టు పర్యటించేలా షెడ్యూల్ ను ఖరారు చేయకుంటే, తమ దేశపు ఆటగాళ్లకు ఐపీఎల్ లో ఆడేందుకు అనుమతులు ఇవ్వబోమని సీఎస్ఏ చెప్పగా, అసలు మీ దేశానికి వచ్చే అవకాశాలే లేవన్న సంకేతాలను బీసీసీఐ పంపింది.
వాస్తవానికి ఈ సంవత్సరం చివర్లో భారత జట్టు దక్షిణాప్రికాలో పర్యటించాల్సి వుండగా, దాన్ని పూర్తిగా పక్కనబెట్టే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుండగా, లంక జట్టు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఇండియాలో పర్యటించనుంది. ఆ పర్యటనను ముందుకు జరిపి, నవంబర్, డిసెంబర్ లలో పెట్టడం ద్వారా దక్షిణాఫ్రికాకు చెక్ చెప్పాలన్నది బీసీసీఐ ప్లాన్ గా తెలుస్తోంది. సౌతాఫ్రికాలో ఇండియా పర్యటనను సందిగ్ధతలోకి నెట్టే ఈ వ్యూహంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.