: చాక్లెట్ తిన్నందుకు ఊడిన ఉద్యోగం!
జర్మనీలోని ఓ కంపెనీ, చాక్లెట్ తిన్న కారణానికి ఓ ఉద్యోగినిని విధుల నుంచి తొలగించింది. చాక్లెట్ తిన్నందుకు ఉద్యోగం ఎందుకు ఊడిందని ఆలోచిస్తున్నారా? తను కొనుక్కొని తినకుండా, పక్కనే పనిచేేసే మరో ఉద్యోగిని బ్యాగులో నుంచి కొట్టేసింది మరి. జూలియానే అనే యువతి చాక్లెట్ ను దొంగతనం చేసిందన్న ఆరోపణలపై నోటీసులు ఇవ్వకుండా సంస్థ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.
అయితే, తనకు చెప్పకుండా ఉద్యోగం నుంచి తీసేశారని ఆరోపిస్తూ, జులియానే కోర్టును ఆశ్రయించగా, వాదనలన్నీ విన్న న్యాయస్థానం ఆమెకే అనుకూలంగా తీర్పిచ్చింది. ఏ చాక్లెట్ నైతే దొంగిలించిందో, అదే చాక్లెట్ ను సహోద్యోగినికి ఇవ్వాలని తీర్పిస్తూ, ఇతరుల వస్తువులను ఇలా తీసుకోవడం తప్పని బుద్ధి చెప్పింది. ఆమె ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా, సంస్థ కూడా వాటిని పాటిస్తూ, జూలియానేను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడంతో కథ సుఖాంతమైంది.