: బాగున్న రోడ్డును తవ్వేస్తున్నారంటూ హైదరాబాద్ టెక్కీల నిరసన!
హైదరాబాద్, మాదాపూర్ సమీపంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు వెళ్లే రహదారి బాగున్నప్పటికీ, తవ్వి మరో రోడ్డును వేయాలని జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోందని వందలాది మంది టెక్నాలజీ ఉద్యోగులు ఆరోపిస్తూ, నిరసనకు దిగారు. రోడ్డును తవ్వి సిమెంట్ రోడ్డు వేయాలని అధికారులు పనులు ప్రారంభించగా, బాగున్న రోడ్డును పాడుచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో గత వారం రోజులుగా ఆన్ లైన్ మాధ్యమంగా ప్రచారం జోరుగా సాగించినా, అది మునిసిపల్ మంత్రి కేటీఆర్ వరకూ వెళ్లకపోవడంతో, వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు.
పలువురు టెక్కీలు గుర్రాలపై ప్రయాణించారు. రోడ్ల తవ్వకం వల్ల తాము ఎన్నో రోజులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల రెండు గంటల వరకూ సమయం వృథా అవుతుందన్నది టెక్కీల వాదన. నగరంలోని ఎన్నో రోడ్లపై గుంతలు ఉండగా, వాటిని సరిచేయకుండా, మరో మూడు, నాలుగేళ్లు ఢోకా ఉండదని భావిస్తున్న రహదారిపై కొత్త రోడ్డేంటన్నది వారి ప్రశ్న.