: జూనియర్ తో బాహాబాహీకి దిగిన బ్రెజిల్ స్టార్ నెయ్ మార్... వైరల్ వీడియో చూడండి
బ‌్రెజిల్, బార్సిలోనా ఫుట్ బాల్ జట్టు సూపర్ స్టార్ నెయ్ మార్ వివాదం రేపాడు. యూఎస్ఏ టూర్ కు వెళ్లేందుకు సమాయత్తమవ్వడంలో భాగంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ సెషన్ లో జూనియర్ తో బాహాబాహీకి దిగాడు. సహచరులు వారిస్తున్నప్పటికీ దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ప్రాక్టీస్ లో భాగంగా జట్టును రెండు టీమ్ లుగా చేసిన కోచ్ మ్యాచ్ ఏర్పాటు చేశాడు. దీంతో సీనియర్ ఆటగాడైన నెయ్ మార్ ను టాకిల్ చేసే బాధ్యతను కొత్తగా టీమ్ లోకి వచ్చిన నెల్సన్ సెమెడో తీసుకున్నాడు.
బంతి నెయ్ మార్ కు అందకుండా ఉండాలన్న ఆలోచనతో వెనుక నుంచి నెయ్ మార్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నెయ్ మార్ కు కోపం ముంచుకొచ్చింది. సెమెడోను నెయ్ మార్ దురుసుగా తోసేశాడు. సీనియర్ బాహాబాహీకి దిగడంతో సెమెడో మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే దూరంగా వెళ్లిన సెమెడోపై నెయ్ మార్ మరోసారి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అనంతరం జట్టు సహచరులు అడ్డుకోవడంతో దురుసుగా బంతిని గోల్ పోస్టుకి తన్ని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రాక్టీస్ సెషన్ నుంచి నెయ్ మార్ వెళ్లిపోవడంతో మరో వివాదం రాజుకుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన సీనియర్ ప్రాక్టీస్ ఎగ్గొట్టడమేంటని ఫుట్ బాల్ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరు కూడా చూడండి.