: నవాజ్ షరీఫ్ కథ కంచికి చేరింది... మరి మన పనామా పేపర్స్ వీరుల సంగతేమిటి?
పనామా పేపర్స్ లో వెలుగు చూసిన అక్రమాస్తుల కుంభకోణం పాకిస్థాన్ ప్రధానిని పదవి నుంచి దించేసిన నేపథ్యంలో భారత్ లో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. పనామా దేశానికి చెందిన మోజాక్ ఫొన్సెకా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖుల అక్రమ వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను బట్టబయలు చేసింది. వర్జిన్ ఐలాండ్స్ లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయలు అక్రమ మార్గాల్లో దేశం దాటించారని స్పష్టంగా నివేదికలు బయటపెట్టింది. ఈ నివేదికలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అజయ్ దేవగణ్, డీఎల్ఎఫ్ ఓనర్ కేపీ సింగ్, వినోద్ అదాని, సమీర్ గెహ్లాట్ తదితరులు స్థానం సంపాదించారు.
పనామా పేపర్స్ లో 36,000 ఫైళ్లను పరిశీలించి, 500 మందికి పైగా భారతీయులు స్ధానం సంపాదించారని నివేదిక వెల్లడించింది. అయితే మొదట్లో వీరిపై చర్యలు ఉంటాయని అంతా భావించారు. పలువురు ప్రముఖుల పేర్లు ఇందులో వెలుగు చూడడంతో ప్రభుత్వం దీనినుంచి దృష్టి మళ్లించింది. దీంతో పనామా పేపర్స్ వ్యవహారంపై ఎలాంటి వ్యతిరేకత వెలువడలేదు. అయితే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పదవి నుంచి తప్పించిన నేపథ్యంలో భారత్ లో కూడా పనామా పేపర్స్ లో స్ధానం సంపాదించిన సంపన్నులపై చర్యలుంటాయా? అని సగటు భారతీయుడు సందేహం వ్యక్తం చేస్తున్నాడు. అధికారం చేపట్టిన అనంతరం బీజేపీ ఇచ్చిన హామీలు మర్చిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.