: బ్రాడ్‌పిట్‌తో విడిపోయాక మొదటిసారి పెదవి విప్పిన ఏంజెలీనా
గతేడాది సెప్టెంబర్‌లో బ్రాడ్‌పిట్‌తో విడిపోయాక సింగిల్ మదర్‌గా తన అనుభవాలను మొదటిసారి మీడియాతో పంచుకున్నారు హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలి. ప్రస్తుతం తన ఆరుగురు పిల్లలతో తన తండ్రి వద్ద ఉంటున్న ఏంజెలీనా కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల వోగ్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత విషయాలు తెలియజేశారు. `నా చిన్నవయసులో మా అమ్మ కూడా సింగిల్ మదరే. ఆమె పరిస్థితి చూసి నేను ఆందోళన చెందేదాన్ని. అదే పరిస్థితి నా పిల్లలకు రాకుండా చూసుకోవాలనుకుంటున్నా. వాళ్లకు తెలియకుండా చాటుగా బాధపడుతున్నా. వాళ్ల ముందు మాత్రం ఆనందంగా ఉండటానికే ప్రయత్నిస్తున్నా!` అంటూ ఏంజెలీనా చెప్పారు. బ్రాడ్‌పిట్‌తో విడిపోవడానికి గల కారణాలపై మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు. తన ఆరుగురు పిల్లలు మానసికంగా చాలా ఎదిగారని, వాళ్లు అన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతున్నారని ఆమె వివరించారు. ప్రస్తుతం వాళ్ల తాత గారితో సమయం గడిపేందుకు చాలా ఇష్టపడుతున్నారని ఏంజెలీనా తెలిపారు. మ్యాడాక్స్, పాక్స్, జహారా, షీలో, నాక్స్, వివియానే బ్రాడ్‌పిట్, ఏంజెలీనాల పిల్లలు. ఏంజెలీనా తల్లి కూడా తన చిన్నతనంలో తండ్రి జాన్ వాయట్ నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఏంజెలీనా, బ్రాడ్‌పిట్‌తో విడిపోవడంతో తన తండ్రితో కలిసి ఉండే అవకాశం దొరికింది.