: చాన్సిస్తే, నాకు, మానాన్నకూ మధ్య చిచ్చు పెట్టే రకాలెన్నో: నారా లోకేశ్
ఏపీలో విపక్షాలకు అవకాశమిస్తే, తనకు, తన తండ్రికి మధ్య చిచ్చు పెట్టాలని చూసే రకాలని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, ఇటీవలి ఓ శిక్షణా కార్యక్రమానికి తాను ఒక రోజు ఆలస్యంగా వస్తే, తనకు, తన తండ్రికి మధ్య గొడవలు జరిగాయని ఓ వర్గం మీడియా వార్తలు రాసిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టే, వారి వ్యాఖ్యలపై స్పందించాల్సి వస్తోందని లోకేశ్ చెప్పారు. ఈ తరహా ప్రచారాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అభివద్ధిని అడ్డుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని విమర్శించారు. చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి చోటా సమస్యలు ఉంటాయని, వాటిని పరిష్కరిస్తూనే, చేస్తున్న పనులను, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.