: ఆర్జేడీతో తెగదెంపులకు అదొక్కటే కారణమా?.. నితీశ్ ధీమా వెనకున్న శక్తి అదేనా?
బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామాతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రెండేళ్ల మహాగట్బంధన్ (గ్రాండ్ అలయెన్స్)కు చెక్ చెబుతూ నితీశ్ టాటా చెప్పేశారు. నేడు బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బీహార్‌లో ఈ పరిస్థితి వస్తుందని, ఆర్జేడీకి, జేడీయూకు పొసగడం లేదన్న విషయం ఈపాటికే తేటతెల్లమైనా నితీశ్ మరీ ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు అంచనా వేయలేకపోయారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం తేజశ్వియాదవ్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని లాలూ ప్రసాద్ యాదవ్ తేల్చి చెప్పడమే నితీశ్ రాజీనామాకు కారణంగా భావిస్తున్నారు. అయితే తాను తేజశ్విని రాజీనామా చేయమని అడగలేదని, వివరణ మాత్రమే అడిగానని నితీశ్ పేర్కొన్నారు. అందుకు ఆయన నిరాకరించారని, దీంతో వారితో కలిసి పనిచేయడం కష్టమని భావించి అంతరాత్మ ప్రబోధం మేరకు రాజీనామా చేసినట్టు నితీశ్ పేర్కొన్నారు.
అయితే ప్లాన్-బి అమలులో భాగంగానే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పాట్నా-ఢిల్లీ మధ్య బలమైన బంధం ఏర్పడిందని, నితీశ్‌కు అండగా ఉంటామని బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకునట్టు చెబుతున్నారు. నితీశ్ రాజీనామా చేసిన వెంటనే మోదీ ట్విట్టర్‌లో అభినందించారు. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో చేరినందుకు ఆనందం వ్యక్తం చేశారు. తనను అభినందించిన మోదీకి నితీశ్ ట్విట్టర్‌లో థ్యాంక్స్ చెప్పారు.
అవినీతి కేసులో సీబీఐ జూలై 7న లాలూ ప్రసాద్ యాదవ్, తేజశ్వి యాదవ్ పేర్లను ప్రకటించినప్పటి నుంచి బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. క్రమంగా రెండు పార్టీల మధ్య బంధం బీటలు వారుతూ వచ్చింది. ఇప్పుడు అది తారస్థాయికి చేరుకోవడంతో బంధం ముక్కలైంది.