: కేజ్రీవాల్ కు షాక్... ఇకపై కేసులు వాదించబోనన్న రాం జఠ్మలానీ... తన ఫీజు రూ. 2 కోట్లు ఇవ్వాలని పట్టు!

అరుణ్ జైట్లీ వేసిన పరువునష్టం దావా కేసులో కేజ్రీవాల్ కు తీవ్రమైన షాకిచ్చారు సీనియర్ న్యాయవాది రాం జఠ్మలానీ. ఈ కేసులో కేజ్రీవాల్ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న ఆయన, అనూహ్య రీతిలో తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో పాటు, తనకు ఫీజుగా రావాల్సిన రూ. 2 కోట్లను వెంటనే చెల్లించాలని అల్టిమేట్టం ఇచ్చి కేజ్రీవాల్ ను మరింత చిక్కుల్లోకి నెట్టారు. కాగా, కోర్టులో జైట్లీని ప్రశ్నిస్తూ, రాం జఠ్మలానీ చేసిన వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవేనని, వాటితో తనకు సంబంధం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేసిన నేపథ్యంలోనే రాం జఠ్మలానీ ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, కేజ్రీవాల్ సహా, ఐదుగురు ఆప్ నేతలపై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా కేసును జైట్లీ వేయగా, విచారణ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాను జైట్లీని అవమానించేలా మాట్లాడాలని రాం జఠ్మలానీకి చెప్పలేదని కేజ్రీవాల్ తాజా అఫిడవిట్ ను కూడా హైకోర్టులో దాఖలు చేశారు. కాగా, ఒకసారి కోర్టుకు హాజరైనప్పుడల్లా రూ. 22 లక్షలను వసూలు చేసే జఠ్మలానీకి ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం రూ. 3.5 కోట్లను ఫీజుగా చెల్లించింది. కేసు నుంచి తప్పుకున్నాను కాబట్టి, మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఇప్పుడాయన డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News