: రూ. 2000 నోట్ల ముద్రణ నిలిపేసిన ఆర్బీఐ... రూ. 200 నోట్లపై దృష్టి!
గత డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపి వేసినట్లు సమాచారం. ఐదు నెలల క్రితం నుంచి కొత్తగా రూ. 2000 నోట్లను ముద్రించలేదని, వీటికి బదులుగా త్వరలో ప్రవేశ పెట్టబోయే రూ. 200 నోట్ల ముద్రణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న రూ. 200 నోట్లను మైసూర్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఆర్బీఐ ముద్రిస్తోంది. నిజానికి వీటిని మార్చిలోనే ప్రవేశపెట్టాలి. కానీ భద్రతాపరమైన చెకింగ్‌లు, నాణ్యత పరీక్షల్లో జాప్యం వల్ల ప్రవేశపెట్టలేకపోయారు. గతేడాది పెద్ద నోట్ల రద్దు మూలంగా ఆర్థిక వ్యవస్థలో నగదు కొరత ఏర్పడింది. దీన్ని తీర్చడానికి చిన్న డినామినేషన్ల నోట్ల ముద్రణకు భారతీయ రిజర్వ్ బ్యాంకు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే ముద్రించిన రూ. 2000 నోట్లు ద్రవ్య మార్కెట్‌లో అధికంగా చలామణిలో ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ. 2000 నోట్లను ముద్రించే యోచనలో ఆర్బీఐ లేనట్లు సమాచారం.