: డ్రగ్స్ వ్యవహారం.. హైకోర్టులో కెవియట్స్ దాఖలు చేసిన ‘తెలంగాణ యూత్ ఫోర్స్’

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ తారల వాదనలను హైకోర్టు వినే ముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ యూత్ ఫోర్స్ సంస్థ కోరింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కెవియట్ దాఖలు చేసింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని వాదిస్తోన్న తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు రాములు రెండు వేర్వేరు కెవియట్లను దాఖలు చేశారు. ప్రముఖ నటులు అల్లు అర్జున్, రానా, నవదీప్, రవితేజాలను సదరు సంస్థ ప్రతివాదులుగా పేర్కొంది.

ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, డ్రగ్స్ కారణంగా తెలంగాణ యువత జీవితాలను కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఈ రోజు సిట్ ద్వారా ఎవరైతే నోటీసులు అందుకున్నారో, వాళ్లందరినీ ఎంతో మర్యాదపూర్వకంగా విచారణ చేస్తున్న సందర్భంలో.. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం సబబు కాదని అన్నారు. ఈ విషయమై తెలంగాణ యూత్ ఫోర్స్ సంస్థ బాధ్యతగా హైకోర్టులో కెవియట్స్ దాఖలు చేశామని చెప్పారు. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన వారిపై ఆరోపణలు రావడం, సిట్ అధికారుల ముందు వారు విచారణకు హాజరవడం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సిట్ అధికారులు ఈ రోజు విచారణ చేయడం జరిగింది.

More Telugu News